19-04-2025 04:34:49 PM
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రజా ప్రతినిధులు సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ఒక రోజు భోజనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి తుమ్మల ఇవాళ బూడిదంపాడు గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో ఈ ప్రజా ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మందికి ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తామని, అందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుంది ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం అని కొనియాడారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయలేరని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం అని,పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. పేదలు దొడ్డు బియ్యం తినలేరని, పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు సైక్లింగ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో పౌర సరఫరాల శాఖ ద్వారా పకడ్బందీగా అమలు చేసి సన్నబియ్యం పంపిణీని తీసుకొచ్చామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉందని, రైతుల శ్రమ ఎక్కడికీ పోదు.. రైతు భరోసా 10 వేల నుంచి 12 వేలకు పెంచినట్లు మరోసారి గుర్తు చేశారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు