30-04-2025 09:00:39 AM
పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
మూడు హై లెవెల్ బ్రిడ్జిలు ప్రారంభించిన మంత్రి తుమ్మల
అశ్వారావుపేట,(విజయక్రాంతి): గిరిజన ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలో మంగళవారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దమ్మపేట మండలంలోని పూసుకుంట, కట్కూరు గ్రామాలకు వెళ్ళే రహదారిలో రూ 4.16 కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు హై లెవెల్ వంతెనలు స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూసుకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండీ, గిరిజనులను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు.
అందుకు అనుగుణంగానే శాసనసభ్యులు జారె ఆదినారాయణ ఆశయాలు అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి పట్ల వారి ఆలోచనలకు అనుగుణంగా తాను ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించి అన్ని విధాల మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో ఈ ప్రాంతాన్ని వ్యవసాయరంగ ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఉచితంగా బోర్లు మోటార్లు మంజూరు చేసి ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించిందని, ఐటీడీఏ ద్వారా ఈ గిరిజన గ్రామాలలో అన్ని సౌకర్యాలు కల్పించబోతున్నామని తెలియజేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలని పేర్కొన్నారు . ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేర్చుతుందని, గతంలో ఈ గిరిజన గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టి స్థానికంగా ఉన్న సమస్యలు గుర్తించి, గెలిచిన వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు అందించటం జరుగుతుందన్నారు.
గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని, దానికి అనుగుణంగానే ఈ గ్రామాలకు రహదారులు, వంతెనలు, వ్యవసాయరంగా అభివృద్ధి తదితర కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం పూసుకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ అడవిని నమ్ముకుని జీవిస్తున్న కొండరెడ్ల గిరిజన కుటుంబాలకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా ప్రోత్సహించాలన్నారు. అన్ని శాఖల అధికారులు నెలకు ఒకసారి ఆ గ్రామాలను సందర్శించి వారి సమస్యలను కలెక్టర్, ఐటీడీఏ పీవోల దృష్టికి తీసుకెళ్లి వారి అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలో ముందుండాలన్నా రు. ఐటీడీఏ ఆధ్వర్యంలో గ్రామస్తులకు మంజూరైన టెంట్ హౌస్, డీజే సిస్టం, తేనెటీగల పెంపకం యూనిట్లను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , ఐటీడీఏ పీవో బి రాహుల్ ,ఆర్డీవో బి మధు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వివిధ శాఖల అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.