జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోనే నూటికి నూరు శాతం గిరిజన జిల్లాగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం సమగ్ర అభివృద్ధిపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లాలో భాగంగా ఉన్న ఈ ప్రాంత అభివృద్ధికి జలగం వెంగళరావు కృషి చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి, ఆంధ్రాలో విలీన మైన ఐదు మండలాలు తిరిగి తెలంగాణలో కలిపేందుకు, జిల్లాలో విమనాశ్రయం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారు.
గతం లోనూ కలెక్టరేట్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలని పాల్వంచ ప్రధాన రహదారిపై ఏర్పాటుకు కృషి చేశారు. సీతారామ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఎంతో కాలంగా మూలన పడిన పంపుహౌజులను వినియోగంలోకి తెచ్చారు. కాలువల ఏర్పాటుకు కృషి చేస్తూ సాగునీటి వనరులను పొలాలకు చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా కేం ద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజర పు రామ్‌మోహన్‌నాయుడును కలిసి జిల్లా లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని తుమ్మల కోరారు.