హైదరాబాద్: ఒకే నెలలో 30 వేల కోట్లు రైతు రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే గర్వించదగిన రోజు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రుణమాఫీ నేపథ్యంలో గురువారం ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన బ్యాంకర్ల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ కింద చేసిన వ్యయం 70 వేల కోట్లు అన్నారు. ఒక రాష్ట్రంలోనే 30 వేల కోట్లు అంటే ఆలోచన చేయండన్నారు. రైతు రుణమాఫీ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్పెషల్ సెక్రటరీ రామకృష్ణారావు లాంటివారు తీవ్రంగా శ్రమించారని ఆయన కొనియాడారు.
రుణమాఫీ సమయంలో బ్రాంచీల వద్ద తొక్కిసలాట జరగకుండా గ్రామాల వారిగా తేదీలు ప్రకటించి రైతు రుణమాఫీని సజావుగా జరిగేలా బ్యాంకులు చూడాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. వర్షాలు మొదలయ్యాయి, కృష్ణ గోదావరి జిల్లాలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న ఆయన రైతు రుణమాఫీ నిధులు సకాలంలో అందితే వ్యవసాయం పండుగల మారుతోందన్నారు. గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు సార్లు విడుదల చేస్తే అవి వడ్డీకే సరిపోయాయని ఎద్దేవా చేశారు. రెండోసారి రైతు రుణమాఫీ కింద 20 వేల కోట్లు విడుదల చేయాల్సి ఉండగా కేవలం పది నుంచి 11 కోట్లు మాత్రమే విడుదల చేశారని మంత్రి తుమ్మల ఆరోపించారు.