01-03-2025 11:29:56 PM
ఖమ్మం,(విజయక్రాంతి): రఘునాథపాలెం మండలాన్ని సస్యశ్యామలం చేసే మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఉగాది నాటికి పూర్తి చేసి ప్రజలకు సాగునీటిని అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. శనివారం ఆయన మంచుకొండలో రూ.66 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉగాది నాటికి మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి, ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మండలంలోని 36 చెరువులను కృష్ణా జలాలతో నింపి, సాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ఈ ఎత్తిపోతల పథకం పూర్తి అయితే మండలంలో తాగునీటి సమస్య కూడా ఉండదన్నారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం మేయర్ నీరజ ఉన్నారు.