08-03-2025 11:43:31 PM
ప్రతీ ఎకరాకు నీరందేలా చర్యలు తీసుకోవాలి
ఉమ్మడి నల్లగొండ ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నల్లగొండ,(విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతీ ఎకరాకు సాగునీరందించి, పంటలు ఎండిపోకుండా చూడాలని ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నల్లగొండ కలెక్టరేట్‌లో శనివారం ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి హాజరై తుమ్మల మాట్లాడారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. తాగునీటి సమస్య తక్షణం తీర్చేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి కలెక్టర్ వద్ద ప్రత్యేక నిధి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాగునీటి అవసరాల కోసం రూ.5 కోట్ల చొప్పున ముగ్గరు కలెక్టర్ల వద్ద రూ.15 కోట్లు ఉంచాలని కోరారు. ఉదయ సముద్రం ప్రధాన కాల్వ పూర్తి చేసి, చెరువులను నింపాలని సూచించారు. అంతకుముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ ఇలా త్రిపాఠి, కోదాడ ఎమ్మెల్యే నల్లమాద పద్మావతికి మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇంటిని ప్రారంభించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.