పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం
భద్రాద్రిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కోసం విజ్ఞప్తి
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆహ్వానం
ఖమ్మం, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఢిల్లీలో బిజిబిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం లేఖలు అందజేశారు. తొలుత పౌర విమానయాన శాఖా మంత్రి కింజారపు రామ్మోహన్‌రావును కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కొత్తగూడెంలలోనూ ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిశారు. తెలంగాణలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఆయిల్‌పామ్ దిగుమతి సుంకం 5 నుంచి 28 శాతానికి పెంచి దేశీయంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించినందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆయిల్‌పామ్‌కు కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల వరదలతో తీవ్రంగా జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రి కళ్లారా చూసిన నేపథ్యంలో తగిన మొత్తంలో కేంద్రం నుంచి సహాయం అందజేయాలని విజ్ఞప్తిచేశారు.
అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనంతరం కేంద్ర ఫుడ్ ప్రాసెసెంగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యానిట్లు ఏర్పాటుచేయాలని కోరారు. ఈ సందర్బంగా ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో తుమ్మల పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగా లులూ గ్రూపు చైర్మన్ యూసూఫ్ అలీ, మోనిన్ ఇండియా ఎండీ జెర్మెన్ అరౌద్, బీఎల్ ఆగ్రో ఎండీ నవనీత్ రవికర్‌తోపాటు పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశ య్యారు. తెలంగాణలో లభ్యమయ్యే అవకాశాలను వివరించి, ప్రాసెసింగ్ యూనిట్లను స్ధాపించడానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం డెలాయిట్ ఇండియా నిర్వహించిన గ్రోత్ విత్ ఇంపాక్ట్ గవర్నమెంట్ సమ్మిట్‌లో పాల్గొని లీడర్స్ టాక్ సెషన్లో భాగంగా వికసిత్ తెలంగాణా అంశంపై ప్రసంగించారు.