calender_icon.png 4 October, 2024 | 4:52 AM

మరోసారి రెచ్చిపోయిన మంత్రి సురేఖ

04-10-2024 02:53:17 AM

కేసీఆర్ కనిపిస్తలేడు.. కేటీఆర్‌కు పిచ్చి పట్టింది 

కేటీఆర్ చేసిన తప్పిదాల వల్లే బీఆర్‌ఎస్ ఓడింది

బీఆర్‌ఎస్ ఓట్లతోనే బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు

గజ్వేల్ సమావేశంలో తీవ్ర విమర్శలు

గజ్వేల్, అక్టోబర్ 3: సినీ నటుల గురించి అభ్యంతరకరంగా మాట్లాడి సర్వత్రా చీవాట్లు తింటున్న మంత్రి కొండా సురేఖ మళ్లీ రెచ్చిపోయారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.

గురువారం గజ్వేల్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిం చారు. బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకుని క్రాస్ ఓటింగ్ చేయటం వల్లనే బీజేపీకి ఎక్కువ ఎంపీ స్థానాలు వచ్చాయని ఆరోపించారు.

18 నెలలైనా ఆప్ నేత సిసోడియాకు బెయిల్ రాలేదని, ఎంపీ ఎన్నికల వగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేలా చేశారంటే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న ఒప్పందాలు అర్థమవుతున్నాయని అన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి సలహాలు ఇచ్చి సహకరించాల్సింది పోయి ప్రతి పనిలో అడ్డుపడుతున్నారని కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు.

పనికిమాలిన సోషల్‌మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తున్నారని కేటీఆర్‌పై ఆరోపించారు. గజ్వేల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ ఒక్కసారి కూడా ప్రజలకు కనబడడం లేదని, అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు కూడా చేయడం లేదని విమ ర్శించారు. గజ్వేల్ ప్రజలు సమస్యల పరిష్కారానికి ఎక్కడికి పోవాలో అర్థం కావడం లేద ని అన్నారు.

కేసీఆర్ కనబడటం లేదని ప్రజలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి మంత్రి సూచించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం కేటీఆరేనని ఆరోపించారు. తనను తాను సీఎంగా భావించు కొని పనికిమాలిన నిర్ణయాలతో కోట్లాది ప్రజాధనాన్ని దోచుకొని బీఆర్‌ఎస్ పార్టీని, కేసీఆర్‌ను అప్రతిష్ఠ పాలు చేశాడని దుయ్యబట్టారు.

అధికారం కోల్పోయి కేటీఆర్ పిచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. మూసీనదిని వారే పాడుచేశారని, ఇప్పడు మూసీనది గురించి, హైడ్రా గురించి అనవసరంగా ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మంచి ఆలోచన లు చేసి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయాలని, ప్రభుత్వం చేసే మంచిపనులకు అడ్డుపడొద్దని సూచించారు. ఈ పందర్భంగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.