calender_icon.png 9 October, 2024 | 4:57 AM

మంత్రి సురేఖ వ్యాఖ్యలతో మా పరువుకు భంగం

09-10-2024 02:45:28 AM

మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

నాంపల్లి కోర్టులో నాగార్జున స్టేట్‌మెంట్ 

సాక్షులు, భార్య, కుమారుడు సహా హాజరు

మొదటి సాక్షిగా స్టేట్‌మెంట్ ఇచ్చిన సుప్రియ

ఈ నెల 10న కొండా సురేఖకు నోటీసులు!

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖ .. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేస్తూ, అక్కినేని కుటుం బంతోపాటు అక్కినేని నాగచైతన్య, నటి సమంత విడాకులకు ముడిపెడుతూ మాట్లాడడంపై నాంపల్లి కోర్టు విచారణ వేగవంతం చేసింది.

మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే మంగళవారం నాగార్జున తన భార్య అమల, కొడుకు నాగచైతన్య, సోదరి సుశీల, కోడలు సుప్రియ, వెంకటేశ్వర్లుతోపాటు తన న్యాయవాది అశోక్‌రెడ్డితో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

మొదట నాగార్జున స్టేట్‌మెంట్ తీసుకున్న కోర్టు, దావాలోని అనేక అంశాలపై ఆరా తీశారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాగార్జున తన స్టేట్‌మెంట్ ద్వారా కోర్టును కోరినట్టు న్యాయవాది అశోక్ రెడ్డి తెలిపారు. సాక్షుల్లో మొదట సుప్రియ వాంగ్మూలం తీసుకున్న కోర్టు.. ఈ నెల 10న రెండో సాక్షి మెట్ల వేంకటేశ్వర్లు సాక్ష్యం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను నాగార్జున తరపున ఆయన కోర్టుకు వివరించారు. కొండా సురే ఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను, మీడియాలో ప్రచారం అయిన వీడి యోలను సైతం కోర్టుకు సమర్పించారు. అయితే, ఇప్పటికే మంత్రి క్షమాపణలు చెప్పి న విషయాన్ని కాంగ్రెస్ లీగల్ సెల్ అడ్వొకేట్ తిరుపతి వర్మ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాగా, ఈ నెల 10న మంత్రి కొండా సురేఖ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఆమె ఈ నెల 10వ తేదీన ఆమె ఏవిధంగా స్పందిస్తారనేది సందిగ్ధంగా మారింది. 

మా కుటుంబం షాక్‌కు గురయింది: సాక్షి సుప్రియ

మంత్రి వ్యాఖ్యలతో తమ కుటుంబం మొత్తం షాక్‌కు గురైందని సాక్షి యార్లగడ్డ సుప్రియ స్టేట్‌మెంట్‌ను కోర్టు నమోదు చేసుకుంది. మంత్రి తమ కుటుంబంపై అలా ఎందుకు మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు. ఈ పరిణామంతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని చెప్పారు. విచారణ ముగిసిన అనంతరరం నాగార్జున కుటుంబం కోర్టు నుంచి వెళ్లిపోయింది. కేవ లం సుప్రియ స్టేట్‌మెంట్‌ను మాత్రమే న్యాయస్థానం రికార్డు చేసింది. ఈ కేసు విచారణను ఈ నెల10కి వాయిదా వేసింది.  

నాగార్జున ఏమన్నారంటే..

మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అమర్యాదకర వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టుకు విన్నవించారు. తన కుమారుడి విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వల్లే జరిగాయంటూ అసభ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు. సిని మా రంగం ద్వారా తమ కుంటుంబానికి పేరు, ప్రతిష్ఠలున్నాయని.. దేశవ్యాప్తంగా తమ కుటుంబం పట్ల ప్రజలు ఆధారాభిమానాలు చూసిస్తున్నారని చెప్పారు.

మంత్రి మాటలు అసత్య ఆరోపణలని పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పారు. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని వార్తా చానళ్లు ప్రసారం చేశాయన్నారు. అన్ని పత్రికలు ప్రచురించాయని చెప్పారు. దీని వల్ల తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందంటూ నాగార్జున కోర్టుకు స్టేట్‌మెంట్ ఇచ్చారు.