15-04-2025 12:58:55 AM
కాటారం, ఏప్రిల్ 14 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా సన్న బియ్యం చే వంట వండిన గిరిజన కుటుంబంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు భోజనం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమని అన్నారు. కాటారం మండలం కొత్తపల్లి తండా గ్రామ నివాసి అయిన వాంకుడోతు సమ్మక్క ఇంట్లో సన్న బియ్యంతో చేసిన బోజనం చేశారు. రేషన్ కార్డులున్న నిరుపేదల కుటుంబాలు సన్నబియ్యం ఆహారాన్ని భుజించాలనే సంకల్పంతో ఉగాది పండుగ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం పంపిణిని ప్రారంభించారని తెలిపారు.
వాంకు డోతు సమ్మక్క కుటుంబ సభ్యులతో ముఖాముఖీ మాట్లాడి , కుటుంబ పోషణ వివరాలు అడిగారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయి, దొడ్డు బియ్యానికి సన్న బియ్యానికి తేడా ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పేదలు కడుపునిండా సన్నబియ్యంతో భోజనం చేయాలని అందుకు సన్న రకం ధాన్యం అవసరమని భావించిన ప్రభుత్వం సన్నరకం ధాన్యం సాగు చేసిన రైతులకు బస్తాకు 500 రూ. బోనస్ చెల్లించినట్లు తెలిపారు. సన్న బియ్యం పధకాన్ని. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అక్రమాలకు. పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మండల ప్రత్యేక అధికారి, డిఆర్డీఓ నరేష్, తహసీల్దార్ నాగరాజు, ఎంపిడిఓ బాబు, ఎంపివో వీరస్వామి పాల్గొన్నారు.