05-04-2025 09:23:16 PM
కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్నదని నిజం కాదా?
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎల్బీనగర్ నియోజకవర్గానికి రూ.110 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం
పదేళ్లలో రాని నిధులు.. 15 నెలలలో వస్తున్నాయి
7న ఎల్బీనగర్ లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.110 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు జిల్లా ఇన్ చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మధుయాష్కీ ఆధ్వర్యంలో శనివారం హయత్ నగర్ లో టీ-నగర్ కాలనీలోని తన నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ... ఎల్బీనగర్ లో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరగని అభివృద్ధి.. 15 నెలల కాంగ్రెస్ పాలనలో జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కొంత వైఫల్యం జరుగుతుందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నిధులు మంజూరు అవుతుంటే.. అక్కసుతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాడని విమర్శించారు. దొంగ చాటున వెళ్లి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ఇన్ చార్జి మంత్రి పేరు లేకుండా శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నారని, వాటిని తొలగించాల్సిందేనని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ లోకి వస్తే నన్ను అడ్డుకునే వారెవరు లేరు అంటూ సిగ్గు లేకుండా సుధీర్ రెడ్డి చెప్పుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి గెలిపిస్తే మోసం చేసి బీఆర్ఎస్ లోకి వెళ్లిన సుధీర్ రెడ్డి.. సిగ్గు లేకుండా మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తానంటూ చెబుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించి పదవులు ఇచ్చినప్పుడే పార్టీని నిలబడుతుందని పేర్కొన్నారు. ఇందుకు తాను కృషి చేస్తూ , కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉండి పనిచేస్తానని పేర్కొన్నారు.