calender_icon.png 24 October, 2024 | 2:11 AM

తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ప్రతీక

17-09-2024 02:55:33 PM

రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అనేది ఒక భౌగోళిక స్వరూప మాత్రమే కాదు. ఇది ఒక అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. నాదిగా అణగదొక్కబడిన తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం దశాబ్దాలుగా పోరాటాలు నిరంతరం కొనసాగాయన్నారు. నాటి ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేటి మిలియన్ మార్చ్ వరకు ఉవ్వెత్తున చేసిన అనేక పోరాటాలు ప్రసిద్ది గాంచాయన్నారు. తెలంగాణ ప్రజాపాలన” దినోత్సవ వేడుకలకు పురస్కరించుకొని మంగళవారం కరీంనగర్ పోలీస్ పరేడ్ మైదానం లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ... సెప్టెంబర్ 17, 1948 సంవత్సరంలో తెలంగాణ నిజాం చెర నుండి విముక్తి పొంది, అఖండ భారత్‌లో విలీనమైంది ఈ రోజన్నారు. ఇంతటి ప్రాముఖ్యత గల  సెప్టెంబరు 17వ తేదీని ‘తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం’గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా ఆనాటి వీరయోధులైన కొమరం భీమ్, దొడ్డి కొమురయ్య, రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, సర్దార్ జమలాపురం కేశవరావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, చాకలి ఐలమ్మ, భీంరెడ్డి నర్సింహా రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బదడం ఎల్లారెడ్డి, సురవరంప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజీ, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు ఇంకా ఎందరో మహానుభావులు వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్నారు. 

2000 సంవత్సరం నుండి మలి దశ తెలంగాణ పోరాటం కొత్త పుంతలు తొక్కి, మరింత సమర్థవంతంగా ప్రజల మదిలోకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వేగంగా వెళ్ళిందన్నారు ఆచార్య కొత్తపెళ్లి జయశంకర్, జమలాపురం కేశవరావు లాంటి మేధావులు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తూ తెలంగాణ భావజాలం ప్రజలలో సజీవంగా ఉండేలా చేశారన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమాలు, శ్రీకాంతాచారి, యాదయ్య లాంటి విద్యార్థులు, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి తెలంగాణ వాదుల ఆత్మబలిదానాలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, ఊరూరా తెలంగాణ ఉద్యమకారుల నిరాహార దీక్షలు వంటి ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు తెలంగాణ వేదికైందని దీంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ  రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు జూన్ 2, 2014 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడం జరిగిందన్నారు.

తద్వారా భారత భౌగోళిక చిత్రపటంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిందని రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా పాలన, పారదర్శక పాలన సమాజంలోని అన్నీ వర్గాలకు స్వేచ్చా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలననేదే ఈ ప్రభుత్వం లక్ష్యం మన్నారు ముఖ్యమంత్రి   ఎనుముల రేవంత్ రెడ్డి దార్శినిక పాలనలో విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధికల్పన, అభివృద్ధి సంక్షేమంతో పాటు ఐటి నుండి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనతికాలంలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే

ప్రజాపాలన కార్యక్రమం:

ఆరు గ్యారంటీలను ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు, నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని మాట ఇవ్వడం జరిగింది. ఈ ఆరు గ్యారంటీలను నిక్కచ్చిగా అమలు చేసి, తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం అహర్శిశలు కృషి చేస్తున్నది. ప్రతి పేదవాడికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో, ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులు స్వీకరించాం. గత సంవత్సరం డిసెంబర్ 28 నుండి ఇప్పటి వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాలో 12 లక్షల 95 వేల 381 దరఖాస్తులు స్వీకరించాం.

మహాలక్ష్మి పథకం అమలు :

మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ఆడబిడ్డలకు రాష్ట్ర నలుమూలలకు ఎక్కడి నుండి ఎక్కడికైనా అణాపైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం కల్పించాం.  జిల్లాలో 15 డిసెంబర్ 2023 నుండి సెప్టెంబర్ 12, 2024 వరకు  1  కోటి 99 లక్షల 67 వేల 980 మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 79 కోట్ల 90 లక్షల 49 వేల రూపాయల లబ్ది చేకూరింది. 

రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు :

రాష్ట్రంలో నిరుపేదలు సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1837  చికిత్సలకు రూ. 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతోంది. ఈ పథకం వల్ల మన జిల్లాలో 15 వేల 302 మంది పేదలకు ఉచిత చికిత్స అందించాం.

500 కే వంటగ్యాస్ సిలెండర్ పంపిణీ :

ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మీ పథకంలోని మరో పథకం రూ. 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. ఈ పథకం కింద మన జిల్లాలో 1 లక్ష 43 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల 53 లక్షల  రూపాయలను సబ్సిడీ అందజేసింది.

గృహజ్యోతితో పేదల ఇంట వెలుగులు :

అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి, వారి గృహాలలో చీకట్లను పారద్రోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. మన జిల్లాలో ఇప్పటివరకూ 1 లక్షా 62 వేల 895 కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధిచేకూరుతోంది. దీనికి గాను ప్రభుత్వం ఇప్పటి వరకూ 6 కోట్ల 17 లక్షల 39 వేల 400  రూపాయలను సబ్సిడీగా చెల్లించింది. 

ఇందిరమ్మ ఇళ్ళు :

పేద, బడుగు వర్గాల స్వంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3 వేల 500 ఇండ్ల చొప్పున నిర్మించాలని  లక్ష్యంగా పెట్టుకున్నాం.

రైతన్నలకు రూ.2 లక్షల వరకూ రుణ మాఫీ :

మా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేశాం. రుణ మాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. మన జిల్లాలో 71 వేల 109 మంది రైతుల ఖాతాలలో రుణమాఫీ కింద రూ. 546 కోట్ల 36 లక్షల 78 వేల 695  రూపాయలను రుణ మాఫీ చేయడం జరిగింది.

రైతు భరోసా :

అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి 10 వేల రూపాయలు మాత్రమే చెల్లించారు. మా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం అమలు చేయబోతోంది.

సన్న వడ్లకి రూ.500 బోనస్ :

మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతోంది. కానీ, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పంటల బీమా పథకం :

రైతులకు పంటలబీమా పథకం వర్తింపచేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతే కాకుండా వ్యవసాయ మరియు రైతు సంక్షేమం కోసం  ప్రభుత్వం “ తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్” ను ఏర్పాటు చేసింది.

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు:

 తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగు పరచడానికి  “తెలంగాణ విద్యా కమిషన్” ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడిలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకూ నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్ లో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పాఠశాలలు తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందజేశాం. అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నాం.