రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కరీంనగర్: తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తోందని మంత్రి. దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కరీంనగర్ పోలీస్ పెరేడ్ మైదానంలో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా విభరించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందన్నారు. ఇందిరమ్మ గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలుచేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తోందని కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 1,82,06,742 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. దీని ద్వారా మహిళలకు 7,268.32 రూపాయల లబ్ధి చేకూరిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు, ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నామన్నారు.
ఈ పథకం వల్ల కరీంనగర్ జిల్లాలో12,969 మంది పేదలు చికిత్సలు పొందగలిగారన్నారు మాతా, శిశు ఆరోగ్య కేంద్రాల ద్వారా ఏప్రిల్ 2024 నుండి జూలై 31, 2024 వరకు 687 సాధారణ కాన్పులు, 1595 శస్ర్త చికిత్స కాన్పులను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లాలో శుక్రవారం సభ కార్యక్రమంలో ప్రతి శుక్రవారం అంగన్ వాడి కేంద్రాలలో ఆరోగ్య సిబ్బంది పాల్గొని ఆరోగ్యం, పోషకాహారం పరిశుభ్రతపై మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు వారికి అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా చేయించడం జరుగుతుందన్నారు నాణ్యమైన వైద్య, పరీక్షలు, శానిటేషన్, అడ్మినిస్ట్రేషన్, ఇన్ ఫెక్షన్ కంట్రోల్ లో 95 శాతం పాయింట్లు సాధించి జాతీయ స్థాయిలో 3వ స్థానమునకు హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి ఎంపికవ్వడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినంసించారు.
నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తోంది. ఈ పథకం కింద ఈ ఒక్క సంవత్సరంలోనే 4 లక్షల 50 వేల గృహాలు నిర్మించ తలపెట్టాం. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుందన్నారు. నానాటికీ పెరుగుతున్న ధరల ప్రభావం పేదప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 1,47,084 మంది వినియోగదారులకు 2,79,243 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగిందని దీనికి గాను ప్రభుత్వం 864.22 లక్షల రూపాయల సబ్సిడిని అందించడం జరిగిందన్నారు. గృహ జ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 1,39,329 జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది. మొత్తం1,57,348 కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం 3223.27 లక్షల సబ్సిడిని అందజేయడం జరిగిందమన్నారు. దేశంలో ఎన్నడూ జరగని రీతిలో, ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీచేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణం మాఫీ చేయడంతో రాష్ట్రంలోని రైతాంగం నేడు పండుగ జరుపుకుంటుంది. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం 58,317 మంది రైతన్నలకు 383.89 కోట్ల రూపాయల రుణమాఫీని చేయడం జరిగిందన్నారు.
ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాల అమలులో భాగంగా 28 డిసెంబర్, 2023 నుండి 6 జనవరి 2024 వరకు జిల్లాలో అన్ని గ్రామాలు మున్సిపల్ వార్డులలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమం ద్వారా 6 పథకాలతో పాటు ఇతర అభ్యర్థనలను కోరుతూ వచ్చిన దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా జిల్లాలో మొత్తం 3,22,264 దరఖాస్తులు రాగా, వచ్చిన ప్రతి ధరఖాస్తును ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియను కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. కలెక్టరేట్ కార్యాలయంతో పాటుగా అన్ని మండల కేంద్రాలలో ప్రజాపాలన సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
బ్యాంకు లింకేజీ కింద 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12010 స్వయం సహాయక సంఘాలకు 770.20 కోట్ల రుణాలను మంజూరు చేశామని రాష్ట్ర స్థాయిలో మన జిల్లా 120.25 శాతంతో ప్రథమ స్థానం సాధించిందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరములో జూలై 2024 వరకు 1930 స్వయం సహాయక సంఘాలకు 198.99 కొట్ల రూపాయల బ్యాంకు ఋణాలను ఇప్పించడం జరిగిందని తెలిపారు. రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకం అమలుతో పాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. 2023-24 యాసంగి సీజన్ లో రైతుబంధు పథకం ద్వారా 1,90,826 మంది రైతులకు 177.61 కోట్ల రూపాయలతో పాటు 2024 రైతు రుణమాఫీ పథకం ద్వారా రెండు దఫాల్లో 58,317 మంది రైతులకు గాను 383.89 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రికి, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహాకారం, సూచనలు అందిస్తున్న పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పొలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.