calender_icon.png 2 April, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడుపునిండా భోజనం అందించడమే ఆశయం

31-03-2025 03:56:32 PM

సన్నబియ్యాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

కాటారం,(విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(IT, Industries Minister Duddilla Sridhar Babu) అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ చౌక ధరల దుకాణంలో  శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, ట్రేడ్ కార్పోరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపునిండా భోజనం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు.  దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని  తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికి ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నేరవేరుస్తూనే గత ప్రభుత్వాలు చేయలేని ఒక చరిత్రాత్మకమైన పనిని కేవలం సంవత్సరంన్నర కాలంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఆయన స్పష్టం చేశారు.  గతంలో రేషన్ బియ్యం పంపిణీలో మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు. గత పది సంవత్సరాలలో  రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఏ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ పథకం రాష్ట్ర ప్రజలకు కలిగించే ప్రయోజనాలను మంత్రి వివరించారు. పేద ప్రజలకు పోషకాలతో కూడిన నాణ్యమైన బియ్యం అందించేందుకు  రాష్ట్ర ప్రభుత్వ చారిత్రక పథకాన్ని ప్రారంభించిందని  అన్నారు. ఈ పథకం చారిత్రకమని, ఇది రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తుందని తద్వారా పేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ... ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తూనే ప్రభుత్వ  ఉద్యోగ నియమాలు చేపట్టామని  అన్నారు.  ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పధకాన్ని  చేపట్టినట్లు తెలిపారు. ఈ పథకం అమలుతో నిరుపేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని తెలిపారు.  రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ అనేది నిరంతరాయంగా కొనసాగుతుందని అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తామని  ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ట్రేడ్ కార్పోరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ... సన్న బియ్యం పంపిణీ పధకం ద్వారా  పేద కుటుంబాలకు  భారం తగ్గుతుందని తెలిపారు.  రేషన్ కార్డులు పంపిణీ చేపట్టి ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎస్ఓ రాములు, ఆర్డిఓ రవి, తహసిల్దార్ శ్రీనివాసులు  తదితరులు పాల్గొన్నారు.