హైదరాబాద్,(విజయక్రాంతి): రైతుల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుందామని కలెక్టర్ వెళ్లారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రైతులను సభాస్థలికి రాకుండా అడ్డగించారని, రైతులను కొందరు రెచ్చగొట్టి కలెక్టర్ పై భౌతిక దాడికి పాల్పడేలా చేశారన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడి ఘటనపై కచ్చితంగా సమగ్ర విచారణ చేస్తామని మంత్రి చెప్పారు. ప్రభుత్వ విధానాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఉపేక్షించించేది లేదని తెలిపారు. పథకం ప్రకారమే రెచ్చగొట్టి కలెక్టర్ పై దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తెలిందని శ్రీధర్ బాబు వెల్లడించారు. అప్రజాస్వామికంగా దాడులు చేస్తే సహించామని, అధికారం రాలేదనే ఆక్రోషంతో బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్లినా బీఆర్ఎస్ అడ్డుకునేందుకు యత్నిస్తోందని, రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంటే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభిప్రాయలు, సూచనలు తెలియజేశామని, బీఆర్ఎస్ విధానాలు నచ్చకుంటే న్యాయ పోరాటం చేశామన్నారు. గతంలో తాము ఎప్పుడూ ఇలాంటి ఘటనలకు పాల్పడలేదని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పరిశ్రమల విషయంలో గతంలో కాంగ్రెస్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, లగచర్లలో ఉన్నతాధికారులపై జరిగిన దాడిలో ఎవరి కుట్ర ఉందో విచారిస్తున్నామని మంత్రి తెలియజేశారు. రాష్ట్రాభివృద్ధికి ఎవరు అడ్డుపడుతున్నారో తేలుస్తామని, నిఘా వైఫల్యమా.. పోలీసుల వైఫల్యమా అనేది విచారణ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.