17-03-2025 12:00:00 AM
పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి
నాగర్ కర్నూల్ మార్చి 16 విజయక్రాంతి: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని ఏదుల నుండి డిండి, నల్గొండ ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కృష్ణా నీటిని తరలించే ప్రక్రియపై ఈ ప్రాంత ప్రజల చేత ఎన్నుపబడిన ఎమ్మెల్యేలు, మంత్రులు నోరు విప్పాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు కార్యక్రమంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
కరువు కాటకాలతో అల్లాడుతున్న పాలమూరు ప్రాంతానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు జీవనది లాంటివని వాటి నిర్మాణం కోసం ఈ ప్రాంత ప్రజలు ఎన్నో భూములను కోల్పోయారని తాజాగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని ఏదుల నుండి డిండి నల్గొండ ప్రాంతానికి కృష్ణ నీటిని అక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసిందని.
ఈ అంశంపై ఈ ప్రాంత వాసులుగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. గత కెసిఆర్ ప్రభుత్వం అప్పట్లోనే డిండి ప్రాంతానికి నీటి తరలింపు ప్రయత్నం చేశారని ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోనే అది నిలిచిపోయిందన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు వాసులను మోసగించి డిండి నల్గొండ ప్రాంతానికి నీటి తరలింపు ప్రక్రియకు తలవంచారని ఆరోపించారు.
కృష్ణ నీటి వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిండి నీటి తరలింపు విషయంలో పునరాలోచన చేయాలన్నారు. వారి వెంట ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు మదిలేటి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.