హైదరాబాద్: భారత రాష్ట్ర సమితిపై కాంగ్రెస్ మంత్రి సీతక్క కీలక విమర్శలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీంగా పనిచేస్తోందని ఆరోపిపంచారు. సచివాలయంలోంచి మంత్రి సీతక్క ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ... బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు నుంచి తప్పించుకునేందుకు బిజెపితో బీఆర్ఎస్ అంటకాగుతోందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ విషప్రచారం చేస్తుందని సీతక్క పేర్కొన్నారు. పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని మండిపడ్డారు. తెలంగాణలోని మహిళలు చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లను ఉసిగొల్పి బీఆర్ఎస్ ధర్నాలు చేయిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదని మంత్రి సీతక్క వెల్లడించారు.