18-04-2025 01:10:51 PM
హైదరాబాద్: ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపూర్ లో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. సదస్సును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క(Minister Seethakka) మాట్లాడుతూ... భూ అక్రమాలకు చెక్ పెట్టాలని భూ భారతి చట్టం(Telangana Bhu Bharati act) తీసుకువచ్చామని తెలిపారు. అర్హులకే భూమి చెందాలని కొత్త చట్టానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వం మంచి లక్ష్యంతో భూ భారతి చట్టం తీసుకువచ్చిందని వివరించారు. పేదింటి బిడ్డలకు సన్న బియ్యం పంపిణీ చేస్తే ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. గూడు లేనివారికే ఇళ్ల ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వం చట్టం చేస్తుందే తప్ప.. అమలు బాధ్యత అధికారులదే: మంత్రి కొండా సురేఖ
సదస్సుల్లో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) మాట్లాడుతూ... గతంలో ధరణి పేరిట ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేశారని మండిపడ్డారు. రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ధరణి తీసుకువచ్చారని విమర్శించారు. రైతులు కోల్పోయిన భూములు వారికే చెందాలనే లక్ష్యంతోనే కొత్త చట్టం తెచ్చామని కొండా సురేఖ తెలిపారు. గతంలో ధరణి ద్వారా ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదన్న మంత్రి కొండా సురేఖ రైతులకు న్యాయం చేసేందుకే భూ భారతి చట్టం అన్నారు. భూ భారతి చట్టాన్ని దళారులు భ్రష్ట్రు పట్టించే ప్రయత్నం చేస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం చట్టం చేస్తుందే తప్ప.. అమలు బాధ్యత అధికారులదే అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా అధికారులు సేవలందించాలని కొండా సురేఖ కోరారు.