ప్రతీ మున్సిపాలిటీలో వేస్ట్ రిసైకిల్ సెంటర్ ఏర్పాటు
పీర్జాదిగూడలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మిషన్ ప్రారంభించిన మంత్రి సీతక్క
డంపింగ్ యార్డ్ ను జనావాసాల మధ్య నుండి తరలించాలని కాలనీవాసుల నిరసన
మేడిపల్లి,(విజయక్రాంతి): తడి, పొడి, హానికారక చెత్త నిర్వహణలో పీర్జాదిగూడ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శమని మంత్రి సీతక్క అన్నారు. స్వచ్ఛ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్(Peerzadiguda Municipal Corporation) నిర్మాణంలో భాగంగా సమీకృత వ్యర్థపదార్ధాల శుద్ధికరణ పార్క్ నందు సుమారు రూ.4.5కోట్లతో ఐటిసి ఏర్పాటు చేసిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్(Solid Waste Management) యంత్రాలను తెలంగాణ గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka), మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి(Medchal MLA Chamakura Mallareddy) కలిసి బుధవారం ప్రారంభించారు. పీర్జాదిగూడలో చెత్త సమస్య పరిష్కారం లభించునుందని, రాష్ట్రంలోని ప్రతీ మున్సిపాలిటీ లలో ఇటువంటి అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయడం ద్వారా తడ, పొడి చెత్త నిర్వహణతో సంపద సృష్టించవచ్చని సీతక్క పేర్కొన్నారు.
డంపింగ్ యార్డ్ తరలించాలి... స్థానికుల డిమాండ్
జనావాసాల మధ్య నుండి డంపింగ్ యార్డ్ ను తరలించాలని మంత్రి సీతక్క కు డంపింగ్ యార్డ్ పరిసర కాలనీ వాసుల వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. కేవలం మంత్రి వచ్చారని ఇంత శుభ్రంచేశారే తప్ప ప్రతీ రోజు అపరశుభ్రంగా ఉంటుందని, భరించలేని దుర్వాసన డంపింగ్ యార్డ్ నుండి వస్తుందని తెలిపారు. గతంలో నాయకులు, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఇక్కడి నుండి తరలిస్తామని హామీ ఇచ్చి తిరిగి రాత్రికి రాత్రే కొత్త మిషన్లు ఏర్పాటు చేసారని వాపోయారు. దుర్వాసన భరించలేక పెద్దలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, శ్వాసకోస,చర్మ వ్యాదులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వెంటనే ఎక్కడినుండి డంపింగ్ యార్డ్ ను తరలించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం పీర్జాదిగూడ మేయర్ అమర్ సింగ్, బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి వజ్రెష్ యాదవ్, కార్పొరేటర్లు, ఐటీసీ ప్రతినిధులు ఉమాకాంత్, సుధ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.