calender_icon.png 18 November, 2024 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ విద్యార్థికి గుండు.. మంత్రి ఆగ్రహం

18-11-2024 02:54:56 PM

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. బాధిత విద్యార్థి తనకు జరిగిన అవమానంపై ఖమ్మం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యార్థి ఫిర్యాదుతో రంగంలోకి దిగి ప్రాథమిక విచారణను మొదలుపెట్టిన పోలీసులు సోమవారం వైద్య కళాశాలలో పూర్తిస్థాయి విచారణ చేపట్టానున్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ ఛార్జే విద్యార్థికి గుండు కొట్టించడంపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను అందించాలని మంత్రి ఆదేశించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ పై వైద్యారోగ్య కార్యదర్శి, డీఎంఈ తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ను యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా..  ఉమ్మడి వరంగల్ కు చెందిన విద్యార్థి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. నవంబర్ 12వ తేదీన మెడికాల్ కాలేజీ హాస్టల్ లో చేరిన విద్యార్థి జుట్టును చూసి కొంతమంది విద్యార్థులు హేళన చేశారు. సీనియర్ల ఒత్తిడితో బాధిత విద్యార్థి జుట్టును కత్తిరించుకున్నాడు. సీనియర్లను మందలించకుండా బాధితుడిపై ఆగ్రహిచిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అదేరోజు రాత్రి విద్యార్థిని తీసుకెళ్లి గుండు గీయించాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెలువడడంతో కాలేజీ ప్రిన్సిపల్ ఈ ఘటనపై ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశారు.