హైదరాబాద్,(విజయక్రాంతి): తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకోవడానికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... బాధ్యతగల ప్రజాప్రతినిధిగా పోలీసుల విచారణకు కేటీఆర్ సహకరించాలని కోరారు. కేంద్ర సహాయం కోసం కలిసి ఢిల్లీ వెళ్దామంటే ప్రతిపక్షాలు ఎప్పుడూ ముందుకు రాలేదని తెలిపారు. ఈ నెల 14 నుంచి ఏడాది పాలన విజయోత్సవాలు జరుపుతామని, ప్రతిపక్షాలు ప్రభుత్వ విజయాలను జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసిన ప్రతి మంచి పనిని ప్రజలకు వివరిస్తామని పొన్నం పేర్కొన్నారు. తెలంగాణ రవాణా విభాగానికి త్వరలోనే లోగో తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు.