కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పర్యతించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబసభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. చిగురు మామిడి మండలంలోని చిన్న ములకనూరు వెళ్తుండగా దారిలో వరి నాట్లు వేస్తున్న రైతులతో మంత్రి ముచ్చటించారు.
తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసిందని ఇప్పటికే లక్ష, లక్ష 50 వేల లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని వారికి వెల్లడించారు. ఒక వేళ రైతు రుణమాఫీ కానీ వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు సూచించారు. తమ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, గతంలో పంట నష్టపోయిన వారికి ఎలాంటి నష్ట పరిహారం వచ్చేది కాదని తెలిపారు. వరి నాట్లు ఎలా జరుగుతున్నాయని, వ్యవసాయ పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. వ్యవసాయ పనుల్లో మహిళా రైతు పాడిన పాటను ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా రైతులు వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారం పై అధికారులను ఆదేశించారు.