calender_icon.png 11 January, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లపై యాక్సిడెంట్లు జరగకుండా చూడాలి

04-01-2025 11:23:22 PM

* ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైన్‌బోర్డులు పెట్టాలి

* రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి

* వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులను ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్,(విజయక్రాంతి): రోడ్లపై యాక్సిడెంట్లు జరగకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Transport and BC Welfare Minister Ponnam Prabhakar) ఆదేశించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ సైన్‌బోర్డులు పెట్టాలన్నారు. శనివారం ఆయన సెక్రటేరియట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి(Collector Manu Chaudhary) సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వరకు హైవే పనులను పరిశీలిస్తూ వచ్చారు. ఆయన ఇక్కడి ఆర్డీవో ఆఫీసులో వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ... ఈనెల 31 వరకు జరగనున్న జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం రోడ్డు భద్రతపై గ్రామగ్రామాన విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణలో ప్రతిరోజూ రోడ్డు యాక్సిడెంట్లలో 20 మంది చనిపోతున్నారన్నారు. ఇప్పటి నుంచి ఒక్క ప్రమాదం కూడా జరగనీయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు, సెమినార్లు, వర్కుషాపులు నిర్వహించాలన్నారు. అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటుచేయాలన్నారు.

రవాణా, ఆర్‌అండ్‌బీ, పోలీసు, విద్యాశాఖలతోపాటు నేషనల్ హైవేస్ అథారిటీతో రోడ్డు భద్రతా కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహించాలన్నారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, రెస్టు లేకుండా వాహనాలు నడపడం తదితర కారణాలతోనే 80 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు నియమాలను పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్డు భద్రతపై ఈ నెల 7న జరిగే సమావేశంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీతో చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.