హైదరాబాద్,(విజయక్రాంతి): కులగణన(Caste Census), ఎస్సీ వర్గీకరణ, డెడికేషన్ కమిటీ నివేదికలపై రెండున్నర గంటలకు పైగా సాగిన తెలంగాణ కేబినెట్ చర్చించింది. అనంతరం ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికకు, కులగణనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కుల సర్వే ఆధారంగా ఆయా కులాల వారికి న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేయించిన సర్వే దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్ లో చేపట్టే కార్యక్రమాలకు ఈ సర్వే రోడ్ మ్యాప్ లాంటిదని, భావితరాలకు న్యాయం చేయటానికి సమగ్రంగా వివరాల సేకరణ జరిగిందన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు చేపట్టాల్సిన పథకాలపై విపక్షాలు సూచనలు చేయాలని మంత్రి పొన్నం కోరారు. బలహీనవర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ విజయవంతంగా అమలైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.