హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దుద్దేడ గ్రామంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సర్వేపై ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రి పొన్నం సూచించారు. ఇప్పటివరకు 35 శాతం కుటుంబ సర్వే పూర్తయింది.. ప్రజలే స్వచ్ఛందంగా సమాచారం ఇస్తున్నారని వెల్లడించారు. సర్వేలపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కులం చెప్పడం ఇష్టం లేకపోతే 999 ఆప్షన్ ఉందన్నారు. ఎన్యుమరేటర్లను ఇబ్బంది పెడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. మార్కెట్ యార్డులో వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారులకు చెప్పాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి వెల్లడించారు. తేమ శాతం 17 లోపు ఉండాలి.. వడ్లు కొనుగోలు చేసిన 48 గంటలు లోపు పేమెంట్ జరుగుతుందన్నారు. రైతులు ఎవరు బయట అమ్ముకోవద్దు.. రాష్ట్ర వ్యాప్తంగా సక్రమంగా జరుగుతుందని ఆయన తెలిపారు. రైతులు మార్కెట్ యార్డు కావాలని తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పిన పొన్నం ప్రభాకర్ మామార్కెట్ యార్డు కోసం స్థల పరిశీలన చేయాలని ఆర్డీవో ను ఆదేశించినట్లు పేర్కొన్నారు.