07-02-2025 12:19:33 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కులగణనపై కులసంఘాల నేతలకు వివరిస్తామని, బీఆర్ఎస్ నేతలు సర్వేలో పాల్గొనరు.. సర్వేను అవహేళన చేస్తారని మంత్రి విమర్శించారు. సర్వేలో పాల్గొన్నవాళ్లకే కులగణనపై మాట్లాడే అవకాశం ఉందని విపక్షలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు వెనుకబడిన వర్గాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణనను దేశం మొత్తం చేయాలని కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమన్నారని హెచ్చరించారు.
కులగణనలో ఏ తప్పు లేదు.. ఏదైనా తప్పు కనిపిస్తే నా దృష్టికి తీసుకురావాలని పొన్నం ప్రభాకర్ చెప్పారు. సబ్ ప్లాన్, పథకాల రూపకల్పనకు కులగణన ఉపయోగపడుతుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కులగణన చేయాలని డిమాండ్ ఉందని, ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న చారిత్రక కులగణనను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. పక్కగా కులగణన పూర్తి చేశామని, ప్రజలు ఇష్టపూర్వకంగా కులగణన కోసం సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు. కులగణన చేయబోమని కేంద్రంలో బీజేపీ అఫిడవిట్ ఇచ్చిందని, కులగణనతో బీజేపీకి ఏం సంబంధం..? అని ప్రశ్నించారు. బీజేపీ ప్యూడలిస్టిక్ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.