రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
హుస్నాబాద్, (విజయక్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచించారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశానని, మళ్ళీ హుస్నాబాద్ ప్రజలు నన్ను కన్నబిడ్డ గా అనుకొని శాసన సభ్యునిగా గెలిపించిన ప్రజల ఆశీషులతోనే మంత్రి పదవి లభించిందన్నారు.
హుస్నాబాద్ లో ఎల్లమ్మ చెరువును సుందరవనంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్ వుండేలా కృషి చేస్తామని చెప్పారు. పద్మశాలి రీడింగ్ రూమ్ కు శంకుస్థాపన చెయ్యడం చాలా సంతోషంగా వుందన్నారు. సిద్దేశ్వర గుట్టకు రూ .20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మల్లె చెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు రహదారి పనులు విస్తరిస్తమని పేర్కొన్నారు. పందిళ్ళ, పొట్లపల్లి రహదారి నిర్మాణం చేపడుతమన్నారు.
బాలికల, బాలుర పాఠశాలకు రోబోటిక్ కంప్యూటర్ ల్యాబ్ ఇస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి మాట్లాడుతూ ఆధ్యాత్మిక, చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఎల్లమ్మ దేవాలయం రాష్ట్రస్థాయిలో ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం విశేష కృషి చేస్తుందని చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక బద్దంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలేక్టర్ గరిమ అగర్వాల్ ,మున్సిపల్ చైర్మన్ రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.