కరీంనగర్,(విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం(District Action Plan Review Meeting) ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగింది. ఇవాళ కలెక్టరేట్ లో జరిగిన ఎమ్మెల్యల మధ్య ఘర్షణపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) తీరు సరిగా లేదని, ఈ ఘటనపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించాలని పొన్నం కోరారు. ఇలాంటి ఘటనలు ప్రోత్సహించాలనుకున్నారేమో చెప్పాలని డిమాండ్ చేశారు. పరుషపదాలు నేర్పే పాఠశాలను బీఆర్ఎప్ పార్టీ పెట్టుకుందా..? అని ప్రశ్నించారు. ఈ ఘటనను మంత్రి తీవ్రంగా ఖండించారు. పార్టీల మార్పుపై జీవితాంతం ఒకే పార్టీలో ఉన్నవాళ్లు మాట్లాడితే అర్థం ఉంటుందని విరుచుకుపడ్డారు. పార్టీలు మారినవాళ్లే ఇతరులను ప్రశ్నించడం సిగ్గుచేటు అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో రాళ్లు వేసిన వాళ్లు మాట్లాడుతున్నారు పార్టీ మారడం గురించి అని మంత్రి పొన్నం దుయ్యబట్టారు. ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా కార్యచరణ ప్రణాళిక సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడేందుకు సిద్ధమౌతుండగా ఆయన మైక్ ఇవ్వొద్దని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. దీంతో తనకు మైక్ ఎందుకు ఇవ్వొద్దని సంజయ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా అడ్డుకున్న కౌశిక్ రెడ్డి నీదీ ఏ పార్టీ అని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి-సంజయ్ ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమీక్ష సమావేశం నుంచి కౌశిక్ రెడ్డిని పోలీసుల బయటకు పంపించారు. సంజయ్ కు ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్లి కాంగ్రెస్ తరుపు జగిత్యాల నుంచి గెలవాలని సవాల్ విసిరారు. ఈ రసాభాస మంత్రులు ఉత్తమ్ కుమర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉన్నప్పుడే జరిగింది. కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.