రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ న్యాయం
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఆదర్శంగా నిలుస్తాం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆదివారం సమావేశమయ్యారు. రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి చర్చించారు. సమావేశంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్న మాట్లాడుతూ... రేషన్ కార్డులకు చాలా డిమాండ్ ఉందన్నారు. రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం చేపడుతోందని వెల్లడించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని అధికారులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ఈ నెల 25 వరకు ప్రజల నుంచి వివరాలు సేకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల(Ration cards, Indiramma houses) కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో స్థలం ఉండి ఇల్లు లేనివారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. జిల్లాల నుంచి వలస వచ్చిన వారికి కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఆదర్శంగా నిలుస్తామని వ్యాఖ్యనించారు. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ న్యాయం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సూచించారు. అసంపూర్తిగా ఉన్న రెండుపడకగదుల ఇళ్లను పూర్తి చేస్తామన్న మంత్రి పొన్నం గుత్తేదారులతో మాట్లాడి రెండు పడకగదుల ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. పూర్తయిన ఇళ్లను లాటరీ వేసి లబ్ధిదారులకు ఎంపిక చేస్తామని వివరించారు.