calender_icon.png 23 October, 2024 | 8:01 PM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం... మంత్రి పొన్నం అలక

09-07-2024 01:15:19 PM

హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వ తరుపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఎల్లమ్మకు పట్టువస్త్రాలను సమర్పించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి అమ్మవారి కళ్యాణానికి హాజరయ్యారు. కాగా.. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అలక వహించారు. ప్రొటోకాల్ పాటించట్లేదంటూ కలెక్టర్ అనుదీప్ పై మంత్రం పొన్నం, మేయర్ విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. మంత్రం పొన్నం ప్రభాకర్ కు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట జరిగిందని, ప్రొటోకాల్ పాటించలేదని కొద్దిసేపు ఆలయం బయటే కూర్చుండిపోయారు.

వీఐపీలు వస్తున్న సమయంలో ఆలయం ఎదుట సరైన సెక్యూరిటీ లేదని మండిపడ్డారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కళ్యాణోత్సవ కార్యక్రమాలు ప్రారంభంకాగా.. సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్లు శాస్త్రోక్తంగా జరిపించారు.  మంగళవారం ఉదయం 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్‌ లగ్న సుముహూర్తమున ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు మహాశాంతి చండీ హోమం, సాయంత్రం ఆరు గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పురవీధుల్లో ఊరేగిస్తారు.