calender_icon.png 3 April, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం... అందరు కార్మికులు మృతి

02-04-2025 03:29:48 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఇన్లెట్-1 ఆఫీస్ వద్ద సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో గల్లంతైన ఆరుగురు కార్మికులు కూడా మృతి చెందినట్లు తెలంగాణ సర్కార్ బుధవారం ప్రకటించింది. మరణించిన మృతుల కుటుంబాలకు ఎక్స్-గ్రేషియాను ఒకటి లేదా రెండు రోజుల్లో అందజేస్తామని అధికారికంగా వెల్లడించింది. ఫిబ్రవరి 22న సొరంగంలోని ఒక భాగం కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. 

గత 40 రోజుల్లో ఇద్దరు కార్మికుల మృతదేహాలు కనుగొనబడినప్పటికీ, మిగిలిన ఆరుగురిని కనుగొనే ప్రయత్నాలు ఇప్పటివరకు విజయవంతం కాలేదు. టన్నెల్ బోరింగ్ మెషిన్‌ను నిర్వహించిన అమెరికాలోని రాబిన్స్ కోసం ఎరెక్టర్ ఆపరేషన్‌గా పనిచేస్తున్న గురుప్రీత్ సింగ్ మృతదేహం మార్చి 9న, టన్నెల్ నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్న జైప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా ఉన్న మనోజ్ కుమార్ మృతదేహం మార్చి 25న కనుగొనబడింది. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్-గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. 

దోమలపెంట గ్రామంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ ఇన్లెట్ సైట్ వద్ద రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... టన్నెల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని, ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి మానవీయంగా సాధ్యమైనదంతా చేశామన్నారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ఇంకా మృతదేహాలు దొరకని ఆరుగురు కార్మికుల కుటుంబాలకు పరిహారం విడుదల చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్‌ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ముందుకు సాగుతామని మంత్రి పేర్కొన్నారు.

మేము ఏవైనా సవాళ్లు, ఇబ్బందులను అధిగమిస్తామని, ఈ ప్రభుత్వం రాబోయే రెండు నుండి రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి సొరంగం ఉపయోగిస్తామని వెల్లడించారు. కృష్ణ జలాశయం నుండి నీటిని తీసుకొచ్చి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందిస్తామని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత 40 రోజులుగా, వివిధ ఏజెన్సీలకు చెందిన దాదాపు 750 మంది రెస్క్యూ సిబ్బంది తప్పిపోయిన కార్మికుల కోసం వెతకడానికి 24 గంటలూ కష్టపడి పనిచేశారని ఆయన చెప్పారు. ప్రస్తుతం రెస్క్యూ కార్మికుల సంఖ్య దాదాపు 550కి తగ్గించబడిందని, వారు టన్నెల్‌ను శుభ్రం చేస్తూ, సిల్ట్, టన్నెల్ బోరింగ్ యంత్రం యొక్క భాగాలను తొలగిస్తూన్నారన్నారు. ఇంకా తప్పిపోయిన ఆరుగురు కార్మికుల మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు.