రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రామాలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిలో భాగంగా ఇప్పటికే 70 కోట్ల రూపాయలను రామాలయం మాడవీదుల అభివృద్ధి కొరకు విడుదల చేయడం జరిగిందని, ఈ మాడవీధుల అభివృద్ధికి సుమారు రెండు ఎకరాలకు పైగా భూమి కావాలని ఇప్పటికే అధికారులు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ప్రజల వద్ద నుండి వ్యాల్యూ చేసి భూమిని గుర్తించడం జరిగిందని త్వరలోనే రామాలయం అభివృద్ధి జరగడం ఖాయమని ఆయన అన్నారు.
అనంతరం ఆలయ అధికారులతో కలిసి రామాలయ మాడవీధుల అభివృద్ధి పనుల వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులం ఉన్నామని ముగ్గురం కలిసి భద్రాచలం రామాలయం అభివృద్ధిలో ముందుంటామని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల కూడా రామాలయం అభివృద్ధికి వెనకడుగు వేయరని పేర్కొన్నారు. భద్రాచలం రామాలయం మీద ప్రేమ ఉంది కనుక భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం జరిగిందని మరొకసారి ఆయన గుర్తు చేశారు.