హైదరాబాద్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక(Indiramma House Beneficiaries Selection)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డా. బీఆర్ అంబెద్కర్ తెలంగాణ సచివాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Houses)ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని, పారదర్శకంగా గ్రామసభల్లో ఇందిరమ్మ లబ్దిదారుల జాబితాలు ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. త్వరలో సర్వేయర్ల, గ్రామాధికారుల నియామకం చేసి మొదటి విడతలో ఇండ్ల స్ధలం ఉన్నవారికి , రెండవ విడతలో ఇంటి స్ధలంతో పాటు ఇందిరమ్మ ఇల్లును నిర్మించి ఇవ్వడంపై నిరంతర ప్రక్రియ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 450 మంది సర్వేయర్లు ఉన్నారని అదనంగా మరో వెయ్యి మంది సర్వేయర్లు అవసరమున్న నేపధ్యంలో సర్వేయర్ల ఎంపికకు కావలసిన ప్రణాళిక పారదర్శకంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు.