calender_icon.png 24 September, 2024 | 3:57 PM

అభివృద్ధి కార్యక్రమాలను త్వరగా, నాణ్యతతో పూర్తి చేయాలి

24-09-2024 01:56:04 PM

రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ప్రైవేటు కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలి

కేఆర్ ఫంక్షన్ హాల్ నుంచి స్కూల్ వరకు లింక్ రోడ్డు మంజూరు

ఖమ్మంలో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

ఖమ్మం,(విజయక్రాంతి): ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ కైకొండాయగూడెంలో టీయుఎఫ్ఐడీసీ నిధులు 195.00 లక్షలతో, 59వ డివిజన్ దానవాయిగూడెం లో 200.00 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజల అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పని చేస్తుందని అన్నారు.

అభివృద్ధిలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ లో రెండు కోట్ల నిధులతో 12 సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో కోటి 30 లక్షలకు డ్రైయిన్, కొన్ని రోడ్ల పనులు చేపట్టామని, అవి నేడు చివరి దశకు చేరుకున్నాయని మంత్రి అన్నారు. స్మశాన వాటిక నిర్మాణానికి నిధులను కూడా మంజూరు చేసుకున్నామని, టెండర్ పూర్తి చేశామని, త్వరలో ఆ పనులు పూర్తవుతాయని, వాటితో పాటు కేఆర్ ఫంక్షన్ హల్ నుంచి స్కూల్ వరకు లింక్ రోడ్డు మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. నేడు శంకుస్థాపన చేసుకున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో 2 నెలల కాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని మంత్రి ఆదేశించారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వం తీసుకొని అర్హులైన పేదలకు పంచడం జరుగుతుందని అన్నారు.

దేవాదాయ, రెవెన్యూ భూములకు సంబంధించి ఎవరు పోజిషన్ లో ఉన్నా యుద్ధప్రాతిపదికన రిటర్న్ తీసుకోవాలని మంత్రి రెవెన్యూ డివిజన్ అధికారి ఆదేశించారు. అనంతరం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలైన జలగం నగర్, రాజీవ్ గృహకల్ప, వికలాంగుల కాలని, కరుణగిరి ప్రాంతాలలో మంత్రి మోటార్ సైకిల్ పై వీధి వీధి పర్యటించారు.  ఈ సందర్భంగా మంత్రి బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్నెరు వరద బాధితులను సంపూర్ణంగా ఆదుకుంటామని, వరదల వల్ల నష్టపోయిన ప్రతిఒక్కరికి పరిహారం అందజేస్తామని, ఆస్తి, పశు నష్టం జరిగిన వాటికి పరిహారాన్ని అందజేస్తామని అన్నారు. 

అధికారులు ముంపు ప్రాంతాల్లోనే సహాయక కేంద్రం, మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి, సర్టిఫికెట్లు కోల్పోయిన వారికీ అందజేస్తామన్నారు. ముంపు వల్ల అపరిశుభ్రమైన ప్రదేశాలను పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని,  అధికారులు మరోమారు సందర్శించి, నష్టపోయిన ప్రతిఒక్కరికి న్యాయం చేస్తారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇర్రిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, మునిసిపల్ డిఇ ధరణి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.