02-04-2025 03:34:59 PM
మరో రెండేళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని అందించే లక్ష్యంగా ఏర్పాటైన శ్రీశైలం ఎడమ గట్టు లెఫ్ట్ బ్యాంక్ కేనాల్ (ఎస్ఎల్బిసి) సొరంగంలో జరిగిన దుర్ఘటనతో చేతులు దులుపుకోలేమని మరో రెండేళ్లలోనే సొరంగ పనులు పూర్తి చేసి సాగు తాగునీటిని అందించి తీరుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా దోమల పెంట వద్ద గల ఎస్ఎల్బీసీ సొరంగం మార్గంలో జరిగిన దుర్ఘటన వివరాలను ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో కలిసి రెస్క్యూ ఆపరేషన్ పనులను పరిశీలించారు.
సొరంగంలోని 14వ కిలోమీటర్ వద్ద సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు కూలి పడి టిబిఎం యంత్రాలతో పాటు పూర్తిగా యంత్ర సామాగ్రి మట్టిలో కూరుకుపోయిందని అందులోనే పనిచేస్తున్న కార్మికులు సైతం 8మంది చిక్కుకుపోయారని పేర్కొన్నారు. ఈ దురదృష్టకరమైన ఘటన జరిగి 40 రోజులు కావస్తోందని ఇందులో ఇద్దరిని మాత్రమే బయటికి తీయగలిగామని మరో 15 రోజుల్లో 150 మీటర్ల పొడవున ఉండే మట్టి శిథిలాలను అన్నింటిని తోడి కార్మికుల ఆనవాళ్లను కూడా గుర్తిస్తామని రెస్క్యూ బృందాలు భీమా వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. నీటి ఊటతోపాటు బురద రోజు రోజుకు పేరుకుపోతూనే ఉందని అయినా వాటన్నింటిని దాటుకుంటూ టీబీఎం యంత్రాలను బయటికి తొలగిస్తూ కార్మికుల ఆనవాళ్లు గుర్తించేందుకు సుమారు 600 మంది రెస్క్యూ బృందాలు అహోరాత్రులు శ్రమిస్తున్నాయని పేర్కొన్నారు.