అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ అట్లాంటాలో ఆవిష్కరించారు. ఆయన విదేశీ గడ్డపై సంబరాలు చేసుకోవడం గర్వంగా ఉందని, మన కలలు, మూలాల శక్తి రెండింటినీ గుర్తు చేస్తూ మంత్రి లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ఈరోజు తెలుగు వారు తలెత్తుకొని తిరుగుతున్నారు అంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్ అన్నారు. పార్టీని స్థాపించిన 9నెలల్లో అధికారంలోకి తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు ఎన్టీఆర్... తెలుగువారి ఆత్మగౌరవం పేరు చెబితే గుర్తుకువచ్చేది విశ్వ విఖ్యాత స్వర్గీయ నందమూరి తారకరామారావు.. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఏ ఆశయం కోసం పార్టీని స్థాపించారో ఆ ఆశయాలతోనే పార్టీని ముందుకు తీసుకెళ్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
అందరూ మిమ్మల్ని ఎన్.ఆర్.ఐ లు అంటారు, కానీ నేను మాత్రం ఎప్పుడూ మిమ్మల్ని ఎం.ఆర్.ఐ లు అనే అనుకుంటానన్నారు. ఎం.ఆర్.ఐ అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ తెలిపారు. మీ జోష్, ఎనర్జీ చూస్తుంటే నేను అట్లాంటాలో ఉన్నానా, అమలాపురంలో ఉన్నానా అనే డౌట్ వస్తోందని లోకేష్ వెల్లడించారు. మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రేమిస్తారు. అమెరికాలో ఉన్నా మీ మనసంతా రాష్ట్రం వైపే ఉంటుందన్నారు. రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధి చెందాలి అని కోరుకుంటారు.. అందుకే మీరు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. సంపాదించిన రూపాయిలో 10పైసలు సొంతగడ్డకు ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల సమయంలో 2 లక్షలు ఖర్చుపెట్టి టిక్కెట్ కొనుక్కొని వచ్చి మరీ ఓటేశారని గుర్తుచేసిన మంత్రి నారా లోకేష్.. కొందరు ఏడాదిపాటు ఎపిలోనే ఉండి సేవలందించారని కొనియాడారు. ఎన్నికల్లో 175కి 175 అన్నవారి ముఖాలు మాడిమసైపోయాయి. ప్రపంచంలో ఉన్న తెలువారందరిదీ ఈ గెలుపు అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.