వేములవాడలో రాజన్న కోడెల విక్రయం కలకలం
రాజన్న సిరిసిల్ల: తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడలో రాజన్న కోడెల విక్రయం కలకలం రేపుతోంది. వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్‌రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ సిఫార్సుతో రాజన్న ఆలయ కోడెలు పక్కదారి పట్టాయి. ఆగస్టు 12న 49 కోడెలను మంత్రి కొండా సురేఖ సిఫారసుతో వరంగల్ జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి ఆలయ ఈవో అప్పగించారు. ఈవో మంత్రి మెప్పుకోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలు అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి 49 కోడెలను అప్పగించిన ఘటనపై విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దల్ నాయకుల ఫిర్యాదుతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు రెండు నుంచి మూడు కోడెలు అప్పగించే అధికారులు మంత్రి ఇచ్చిన సిఫారసును విచారించకుండా 49 కోడెలు ఇవ్వడంతో ఆందోళనలు నెలకొన్నాయి. మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పశువుల వ్యాపారిగా ఉన్న మంత్రి అనుచరుడికి రాజన్న కోడెలు ఏలా ఇస్తారని ఆలయ ఈవో వినోద్ రెడ్డిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.