21-03-2025 12:45:07 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అసెంబ్లీలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Minister Komatireddy vs MLA Harish Rao) అన్నట్లు సభ సాగుతోంది. గ్రామీణ రోడ్లకు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి వెల్లడించారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని కోమటిరెడ్డి(Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. ఆరు నెలలకో.. మూడు నెలలకో కాంట్రాక్టర్లకు చెల్లిస్తామన్నారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్ వేయిస్తామని మంత్రి కోమటి రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కే రోడ్డు వేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఆ మూడు చోట్ల రోడ్లకు చివరకు సింగరేణి నిధులు కూడా వాడారని విమర్శించారు. ఛాలెంజ్ చేస్తున్నా.. రాష్ట్రమంతా తిరిగి చూద్దామా? అని కోమటిరెడ్డి సవాల్ విసిరారు.
మంత్రి కోమటిరెడ్డి విసిరిన ఛాలెంజ్ స్వీకరిస్తున్నా: హరీశ్ రావు
మంత్రి కోమటిరెడ్డి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్అండ్ బీ పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. ఒక రోజు రోడ్ల గురించి ప్రత్యేకంగా చర్చిద్దామని మంత్రిని కోరారు. రాష్ట్రమంతా రోడ్లు వేశామని హరీశ్ రావు చెప్పారని సభాపతి గడ్డం ప్రసాద్ తెలిపారు. మా వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదన్నారు.