18-03-2025 02:32:40 PM
హైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ ప్లాన్ చేసిన రీజినల్ రింగ్ రోడ్ (Regional Ring Road) ప్రాజెక్ట్ గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చలు జరిపినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) తెలిపారు. శాసనసభలో మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అలైన్‌మెంట్(Alignment) ఖరారు చేయబడిందని, త్వరలో సమర్పించబడుతుందని కోమటిరెడ్డి ప్రకటించారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి రూ.7,100 కోట్లతో టెండర్లు పిలిచామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి రెండు నెలల్లో కేంద్రం అనుమతి ఇప్పించి పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని కేద్రమంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్(RRR) ఉత్తర భాగానికి డీపీఆర్ సిద్ధం చేయాలని గడ్కరీ అన్నారు. మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధం చేస్తామని గడ్కరీకి చెప్పామని, డీపీఆర్ తయారు చేసేందుకు ఏజెన్సీల ఎంపిక జరిగిందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడం వలన హైదరాబాద్ మౌలిక సదుపాయాలు మారుతాయని ఆయన పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ పనులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని గడ్కరీ తనకు హామీ ఇచ్చారని కోమటిరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్ట్ మూడున్నర నుండి నాలుగు సంవత్సరాలలోపు పూర్తవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో తాను ఏడుసార్లు గడ్కరీని కలిశానని కూడా మంత్రి వెల్లడించారు. ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ, భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) నాయకుల మాదిరిగా కాకుండా, తన పార్టీకి రోడ్లను అమ్మే అలవాటు లేదని ఆయన వ్యాఖ్యానించారు. మార్కెట్ ధరల ఆధారంగా పరిహారం అందిస్తామని హామీ ఇస్తూ, భూసేకరణ ప్రక్రియకు సహకరించాలని కోమటిరెడ్డి ప్రజలను కోరారు. అధికారులపై దాడులకు దిగవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే అలాంటి చర్యలు అభివృద్ధి ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయని మంత్రి సూచించారు.