ఫాగింగ్ కు అనువైన బుల్లి బైకును రెడీ చేసిన యువకులు
నల్గొండ: జిల్లా కేంద్రంలో గడచిన రెండు రోజులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. జిల్లాలో ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ బీజీ బీజీగా గడుపుతున్నారు. మరోవైపు ఓ బుల్లి బైకును స్వయంగా నడిపి కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
వర్షాకాలం కావడంతో దోమలబెడద పెరిగింది. దీంతో నిత్యం గ్రామాల్లో దోమలు మందు కొట్టించాలని స్థానిక కౌన్సిలర్లను ఆదేశించారు. ఉన్నంతలో ప్రయత్నం చేసినా అనుకున్నంత దోమల బెడద తగ్గడం లేదనుకున్న 19వ వార్డు కౌన్సిలర్ కుమారుడు గోగుల గణేష్ వార్డులోని యువకులు కలిసి ఏకంగా దోమల నివారణ కోసం అనువుగా ఉండే ఫాగింగ్ మిషన్ తో కూడిన బుల్లి బైకును రెడీ చేశారు.
తమ అభిమాన నాయకుడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పర్యటనలో ఉండటంతో మంత్రి చేతుల మీదుగా ప్రారంభం చేయించాలని గణేష్, వార్డు యువకులంతా మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి మంత్రికి విషయం వివరించారు. వార్డులోని చిన్న చిన్న గల్లీల్లో కూడా ఫాగింగ్ కు అనువుగా ఉండేలా బుల్లి బైకును రెడీ చేశామని, ఫాగింగ్ మిషన్ లో ఒక్కసారి కెమికల్ నింపి ఆన్ చేస్తే వార్డంత కవర్ చేసుకునేలా ఫాగింగ్ మిషన్ ఉందని వారు మంత్రికి తెలిపారు.
కాంగ్రెస్ కార్యకర్తల చొరవను చూసి సంతోషం వ్యక్తం చేసిన మంత్రి స్వయంగా ఆ బుల్లి బైకును నడిపి కార్యకర్తల్లో, వార్డు ప్రజల్లో జోష్ ను నింపారు. అంతేకాదు, ఇంత మంచి ఆలోచన చేసిన గణేష్ తో పాటు కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. స్వయంగా మంత్రే బుల్లిబైక్ ను నడుపుతూ గల్లీ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో ఇప్పుడు ఈ బుల్లి ఫాగింగ్ బైక్ నల్గొండలో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.