calender_icon.png 6 April, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి నీటి బొట్టు ప్రవాహాన్ని చెరువులకు మళ్ళించాలి

05-04-2025 09:41:37 PM

చెరువులకు నీరు వచ్చే సహజమార్గాలను( ఫీడర్ చానల్స్) పటిష్టం చేయాలి

భూ సేకరణ అంశంలో రెవెన్యూ అధికారులతో సమన్వయం తీసుకోవాలి

నీటి పారుదల అధికారుల సమీక్ష లో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): వర్షకాలంలో కురిసిన ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి చెరువు లకు మల్లించుకునేలా సహజ మార్గాలను పటిష్టం చేసుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల రంగంలో నిష్ణాతులైన రిటైర్డ్ అధికారులు, రేవిన్యూ అధికారులు, మునుగోడు నియోజకవర్గ పరిధిలో పనిచేసే నీటిపారుదల అధికారులు, మండలాల ముఖ్య నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 501 చెరువులను విడతల వారిగా అభివృద్ధి చేసుకోవాలని, మొదటి విడతగా 124 చెరువులు, 17 చెక్ డ్యాములు, ఒక కట్స్, 41 భూ అంతర్గత చెక్ డ్యాంలు, ఫీడర్ చానల్స్ అన్ని కలుపుకొని 193 పనులు అభివృద్ధి చేయడానికి ఎస్టిమేషన్స్ వేసి ఉన్నతాధికారులకు ప్రపోజల్స్ పంపించారు.

వర్షపు నీరు చెరువులలోకి చేరడానికి  సహజమార్గాలైన ఫీడర్ చానల్స్ ని పటిష్టం చేయడం, చెరువు కట్టలను పటిష్ట పరచడం, చెరువుల్లో పూడిక తీసి నీటి నిలువ సామర్థ్యాన్నిపెంచే విధంగా  పనులు వేగవంతం చేయాలన్నారు. మునుగోడు మండలంలో 5 ఫీడర్ ఛానల్స్, నాంపల్లి మండలంలో 4 ఫీడర్ చానల్స్, చండూరు మండలంలో 7 ఫీడర్ చానల్స్, గట్టుప్పల్ మండలంలో 1 ఫీడర్ ఛానల్, నారాయణపూర్ మండలంలో 2 ఫీడర్ చానల్స్, మర్రిగూడ మండలంలో 3 ఫీడర్ చానల్స్, చౌటుప్పల్ మండలంలో 2 ఫీడర్ చానల్స్ పనులు పూర్తిచేసి వీటి పరిధిలో ఉన్న చెరువులను వర్షపు నీటితో నింపాలన్నారు. ఫీడర్ చానల్స్ అభివృద్ధి చేసే సందర్భంలో భూసేకరణ లాంటి అంశాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి రెవిన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని పనులు పూర్తి చేయాలన్నారు. రాబోయే మూడున్నర సంవత్సరాలలో విడతల వారీగా చిన్న నీటి వనరులను పటిష్టపరుచుకుని నియోజకవర్గంలో నీటి కొరత లేకుండా చూడాలన్నారు.