calender_icon.png 23 October, 2024 | 9:56 AM

మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది : కిషన్ రెడ్డి

09-07-2024 04:12:28 PM

హైదరాబాద్ : 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు అనేక హామీలు ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహిళలకు ప్రతీనెల రూ.2500 ఇస్తామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో మహళకు రూ.20 వేలు బాకీ ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు, కళ్యాణలక్ష్మీ కింద రూ. లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్నారు.. ఇప్పటివరకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నా మహిళలకు న్యాయం జరగలేదని కిషన్ రెడ్డి ఎద్దెవా చేశారు. అమలు చేయలేని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.

మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి.. బస్సులు తగ్గించారని, తెలంగాణ ఆడబిడ్డల తరపున ప్రశ్నించే బాధ్యత మేము తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. హామీల అమలు కోసం సీఎంపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారని, రాహుల్ పర్యటనల కోసం ఆర్ఆర్ ట్యాక్స్ ఉపయోగిస్తున్నారు. మహిళలపై రేవంత్ రెడ్డికి గౌరవం ఉంటే బెల్ట్ షాపులు మూయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం వచ్చి పదేళ్లైనా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రేషన్ కార్డు లేక మహిళలు గ్యాస్ కనెక్షన్లు తీసుకోలేకపోతున్నారని, కొత్త రేషన్ కార్డులు ఇస్తే రాష్ట్రప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? అని అడిగారు.