హైదరాబాద్,(విజయక్రాంతి): భాగ్యనగరం మరో అంతర్జాతీయ వేడుకకు సిద్ధమవుతోంది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13, 14, 15వ తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే 7వ అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ కోసం పర్యాటక, సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ బేగంపేట్ హరిత ప్లాజాలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పోస్టర్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామన్నారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 16 దేశాల నుంచి 47 మంది కైట్ ప్లేయర్స్, 14 రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ క్లబ్ సభ్యులు పాల్గొని వివిధ డిజైన్ల పతంగులను ఎగురవేస్తారు.
జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను, తెలంగాణ పిండి వంటలు స్టాళ్లలో ప్రదర్శిస్తారు. ప్రతి ఒక్కరూ తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, వారసత్వ కట్టడాలు, ప్రాచీన దేవాలయాలను సందర్శించాలని ప్రజలకు సూచించారు. దీనికి తెలంగాణ టూరిజం శాఖ తోడ్పాటునందిస్తుందని, పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వల్ల ఆ ప్రాంత చరిత్ర సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవడంతో పాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్మితా సబర్వాల్, అధికారులు, నాయకులు, కళాకారులు హాజరయ్యారు.