01-03-2025 04:09:51 PM
హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel Incident) బోరింగ్ మిషన్ ను కటింగ్ చేస్తున్నారని, మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్న చోటు తవ్వకాలు జరుగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణరావు(Minister Jupally Krishna Rao) దోమలపెంట వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 5-8 మీటర్ల మట్టిదిబ్బ కింద నలుగురి ఆనవాళ్లు స్కానింగ్ లు గుర్తించాయని తెలిపారు. మరో నలుగురు సిబ్బంది టన్నెల్ బోరింగ్ మిషన్ కింద ఉన్నట్లు తెలుస్తోందన్నారు. సహాయక చర్యల్లో మొత్తం 11 విభాగాల వాళ్లు పనిచేస్తున్నారని మంత్రి ప్రకటించారు. నలుగురిని రేపు సాయంత్రంలోపు బయటకు తీసే అవకాశముందని మంత్రి వెల్లడించారు
పనులు వేగంగా జరగటం లేదని కొందరు విమర్శిస్తున్నారని మండిపడిన మంత్రి జూపల్లి విమర్శించే వారు లోపలికి వెళ్లి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. కాళేశ్వరం(Kaleshwaram Lift Irrigation Project)లో200 కి.మీ టన్నెల్ తవ్విన వాళ్లు పదేళ్లలో 20 కి.మీ టన్నెల్ ఎందుకు తవ్వలేదని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. పదేళ్లలో పూర్తి చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదేమోనని మంత్రి జూపల్లి తెలిపారు. కాసేపట్లో రెస్క్యూ టీమ్ టన్నెల్ నుంచి మృతదేహాలను వెలికి తీయనుంది. అధికారులు పోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కార్మికులను బయటకు తీసేందుకు 8 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కుటుంబ సభ్యులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు.