రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా
సంగారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యా సంస్థల్లో నిర్మాణం చేస్తున్న పనులు నాసిరకం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు. ఆదివారం అందోల్‌లోని ప్రభుత్వ విద్యా సంస్థలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్య సంస్థల్లో విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని తెలిపారు. వార్షిక పరీక్షలకు సమయం దగ్గర పడుతుంది విద్యార్థులు మరింత శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని విద్యాసంస్థల్లో మాడ్రన్ కిచెన్ లు, డైనింగ్ హాల్ ల నిర్మాణం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి నేరుగా పుల్కల్ మండలంలోని కేజీబీవీకి వెళ్లిన మంత్రి, అక్కడ చేపడుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆ తర్వాత పుల్కల్, అందోల్ మండలాల్లోని మోడల్ పాఠశాలలు , గురుకుల పాఠశాలలు, పాలిటెక్నిక్ కళాశాల, నర్సింగ్ కాలేజీలను సందర్శించారు.
స్కూళ్లలో నిర్మిస్తున్న మోడ్రన్ కిచెన్స్, డైనింగ్ హాల్స్ డిజిటల్ క్లాస్‌రూమ్స్, పేరెంట్స్ వెయిటింగ్ హాల్స్, సెక్యూరిటీ రూమ్స్, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్స్, తదితర నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. విద్యాసంస్థల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఎక్కడైనా లోపాలు ఉన్నట్టు అధికారులు గుర్తిస్తే వెంటనే వాటిని గుత్తేదారులతో సరి చేయించాలన్నారు. నాసిరకంగా పనులు చేపట్టే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వీలైనంత త్వరగా విద్యాసంస్థల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లదేనని మంత్రి గుర్తు చేశారు. అన్నిరకాల సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు.
విద్యా సంస్థలకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని టీచర్లకు మంత్రి సూచించారు. అందోల్ నియోజకవర్గాన్ని ఉమెన్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే అనేక పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పామని, ఇటీవలే నర్సింగ్ కాలేజీ కూడా ప్రారంభించామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి అందోల్‌లో చదువుకుంటుకున్నారని, వారందరీ బాగోగులూ చూసుకోవాల్సిన బాధ్యత అందోల్ ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.త్వరలోనే కొత్త నర్సింగ్ కాలేజీ భవనం, హాస్టల్, హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున మరింత శ్రద్ధగా చదువుకోవాలని విద్యార్థినీ, విద్యార్థులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు, తహసీల్దార్ విష్ణు సాగర్ ,కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.