26-02-2025 03:44:05 PM
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి జాతరను ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
పాపన్నపేట,(విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంజీరా నది తీరాన వెలిసిన ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గమ్మ క్షేత్రం లో జరిగే మూడు రోజుల జాతర ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి జాతర ఉత్సవాలను లంచానంగా ప్రారంభం చేసారు. ఈ సందర్బంగా దేవాలయం కు చేరుకున్న మంత్రి మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది అతిధి మర్యాదలతో అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సాంప్రదాయ బద్ధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల వన దుర్గమ్మ దేవాలయం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవాలను ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని మంత్రి వెల్లడించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. జిల్లాకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యం కోసం తాత్కాలిక ఆసుపత్రి తో పాటు 10 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 25 మంది డాక్టర్లు, 256 మంది సిబ్బంది , అత్యవసర పరిస్థితిలో సేవలు అందించేందుకు నాలుగు అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచామన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.