01-04-2025 11:59:41 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): కంచ గచ్చిబౌలిలో భూవివాదం దృష్ట్యా హెచ్‌సియూ సందర్శనకు యత్నించిన బీజేపీ నేతలను అరెస్టు చేయడంపై కేంద్రం మంత్రి బండి సంజయ్ స్పందించారు. ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదని బండి పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలిలోని భూమికి సంబంధించిన వివాదంపై తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తోందని, అక్కడున్న భూములను వేలం వేయడం కుదరదని బండి సంజయ్ స్పష్టం చేశారు. విషయం తెలిసి కూడా ప్రభుత్వం కోర్టు దిక్కరణకు పాల్పడుతోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గచ్చిబౌలి భూముల అమ్మకం నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకోవాలని, ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బండిసంజయ్ చెప్పారు. అలాగే హెచ్‌సియూ సందర్శనకు బీజేపీ నేతల పిలుపు దృష్ట్యా బీజేపీఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి హౌజ్ అరెస్టు చేసి, బంజారాహిల్స్ లోని మహేశ్వర్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. హెచ్‌సియూ భూములను పరిశీలించేందుకు బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హెచ్‌సియూ భూముల వద్ద వాస్తవ పరిస్థితులను బీజేపీ ఎమ్మెల్యేలు తెలుసుకోవలనుకున్నారు. కానీ హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు భారీగా పోలీసుల మోహరించి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డగించి అరెస్ట్ చేశారు.