14-03-2025 01:28:33 AM
గోవా రోడ్‌షోలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): ఎక్స్‌ప్లొరేషన్ లైసెన్స్ విధానం అమలు, క్రిటికల్ మినరల్స్ కోసం వేలం నిర్వహించడం ద్వారా మైనింగ్ రంగం లో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం గోవాలో కేంద్ర గనుల శాఖ ఆధ్వ ర్యంలో జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో మైనింగ్ రంగాన్ని దేశంలో గ్లోబల్ లీడర్‌గా నిలిపేందుకు మరింత కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రేర్‌ఎర్త్ ఎలిమెంట్స్, లెడ్, జిం క్, డైమండ్, గోల్డ్, కాపర్, వెనేడియం అన్వేషణ కోసం ఏపీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో 13 బ్లాకుల వేలం ప్రారంభించామన్నారు.
పారదర్శకమైన వేలం విధానాన్ని తీసుకురావడం ద్వారా మైనింగ్ రంగం కొత్త పుంతలు తొక్కిందన్నారు. గతంలో ఖనిజాల అన్వేషణలో ప్రైవేటు రంగ సంస్థలకు అవకాశాలు ఉండేవి కావని, ఆ ఇబ్బందులను గుర్తించిన కేంద్రం 2023లో మైన్స్ అండ్ మినరల్ చట్టాన్ని తీసుకొచ్చి నూతన లైసెన్స్ జారీ విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. ఇప్పటివరకు దేశంలో 24 క్రిటికల్ మినరల్స్ బ్లాక్స్‌ను విజయవంతంగా వేలం వేశామన్నారు.
69, 988 సర్జరీలతో రికార్డు
తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ 69, 988 సర్జరీలతో సరికొత్త రికార్డు సృష్టించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో రోగులకు సేవలు అందిస్తోందని ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. గతేడాది 9.9 లక్షలకు పైగా రోగులు వైద్య సేవల కోసం బీబీనగర్ ఎయిమ్స్‌కు వచ్చారని తెలిపారు. ఎంఆర్‌ఐ 3టి, 160-స్లుసై సీటీ వంటి అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలను కూడా అందిస్తుందన్నారు.