- ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకోవాలి
- గనుల వృద్ధికై అన్ని చర్యలు తీసుకుంటున్నాం
- పలు మైనింగ్ సంస్థలకు 5 స్టార్ రేటింగ్స్ ప్రదానం
- కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): దేశ ఆర్థికాభివృద్ధిలో గనుల రంగం పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమని, రానున్న రోజుల్లో దేశం మైనింగ్ రంగంలో స్వయంసమృద్ధి సాధించే దిశగా మరింత కృషి జరగాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్నది మైనింగ్ పరిశ్రమేనని అన్నారు. బుధవారం ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో, సుస్థిరాభివృద్ధి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేస్తున్న 68 సంస్థలకు కేంద్రమంత్రి 5 స్టార్ అవార్డులను ప్రదానం చేశారు.
ఇందులో తెలంగాణ నుంచి 5, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మైనింగ్ సంస్థలున్నాయి. అవార్డులు పొందిన సంస్థలను ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి అభినందించారు. మైనింగ్ రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు పనిచేస్తున్న వారందరినీ ప్రోత్సహించడం కేంద్రం బాధ్యత అన్నారు. ఈ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ హైదరాబాద్‌లో ఓ వర్క్‌షాప్ నిర్వహించారని గుర్తుచేసిన ఆయన.. మైనింగ్ పరిశ్రమ ప్రతినిధులు ఇచ్చిన సూచనల ఆధారంగా కొత్త నిబంధలను నిర్దేశించుకుని ముందుకెళ్తున్నామన్నారు.
దేశాభివృద్ధిలో మైనింగ్ రంగం భాగస్వామ్యం కావాలి...
మైనింగ్ రంగం, మంత్రిత్వ శాఖ సమన్వయంతో పనిచేస్తూ దేశాభివృద్ధిలో భాగస్వా మ్యం కావాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలో అపారమైన ఖనిజ సంపద ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ ఆలోచన ప్రకారం దేశం ఈ రంగంలో స్వయంసమృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. క్రిటికల్ మినరల్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, మన దేశంలో ఉన్న వనరులను సద్విని యోగం చేసుకుంటే దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు.
మైనింగ్‌లో సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి తో పాటుగా పర్యావరణాన్ని కాపాడేదిశగా పనిచేయాలని మైనింగ్ కంపెనీలకు కేంద్రమంత్రి సూచించారు. కార్మికుల భద్రత, ఉత్పత్తిని పెంచడం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సాంకేతికత వినియోగం చాలా అవసరమని తెలిపారు. బడ్జెట్‌లో 25 క్రిటికల్ మినరల్స్ మీద కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తొలగించిందని, ఫలితంగా దేశంలో వాటి ప్రాసెసింగ్ మెరుగుపడుతుందని కిషన్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్‌చంద్రదూబే, గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, అదనపు కార్యదర్శి లోహియా, ఐబీఎం సెక్రటరీ జనరల్ పీఎన్ శర్మతోపాటు వివిధ రాష్ట్రాల గనుల శాఖ ఉన్నతాధికారులు, అవార్డు గ్రహీతలు, మైనింగ్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
5 స్టార్ రేటింగ్ పొందిన కంపెనీలు
తెలంగాణ
1. మైహోం, చౌటుపల్లి-
2. టీఎస్‌ఎండీసీ, దేవాపూర్
(మంచిర్యాల)
3. మైహోం,- మేల్లచెరువు
4. రైన్ సిమెంట్స్, నల్లగొండ
5. సాగర్ సిమెంట్స్, నల్లగొండ
ఆంధ్రప్రదేశ్
1. భారతి సిమెంట్స్ లైమ్‌స్టోన్, కడప
2. జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్
లైమ్‌స్టోన్, నంద్యాల
3. దాల్మియా సిమెంట్స్,
నవాబ్‌పేట- తలమంచిపట్నం
4. అల్ట్రాటెక్, తుమ్మల పెంట
5. శ్రీజయజ్యోతి (మైహోం) సిమెంట్స్, కర్నూల్