07-04-2025 07:14:26 PM
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కనీస వేతనం 18వేల రూపాయలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ కరుణ కుమారి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాలుగు సెంటర్లకు చెందిన సుమారు వందమంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఏఐటీయూసి(అంగన్వాడీ) యూనియన్ లో చేరారు.
వీరికి ఏఐటియుసి(అంగన్వాడీ) యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ కరుణకుమారి యూనియన్ కండువాలు కప్పి, సాదరంగా యూనియన్ లోకి ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాలకు పాఠశాలలకు సమానంగా ఒక పూట బడి, వేసవి సెలవులు అమలు చేయాలన్నారు. జూలై, 2024లో అంగన్వాడి టీచర్లు, ఆయాలను రిటైర్డ్ చేశారని, ఇంతవరకు వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదన్నారు. తక్షణమే టీచర్ లకు రెండు లక్షల రూపాయలు, ఆయాలకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, అదే విధంగా విధుల్లో ఉండి చనిపోయిన వారికి సైతం రిటైర్మెంట్ అయిన వారితో సమానంగా బెనిఫిట్స్ అందజేయాలన్నారు.
20 సంవత్సరాల కిందట ఇచ్చిన గ్యాస్ పొయ్యిలు, కుక్కర్లు, వంటసామాగ్రి పాడైపోయాయని, అంగన్వాడి సిబ్బంది వాటిని తమ సొంత ఖర్చుతో రిపేరు చేసుకున్నారని, వెంటనే అంగన్వాడి సిబ్బందికి నూతన గ్యాస్ స్టవ్ లు, కుక్కర్లు, వంట సామాగ్రి అందజేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి టీచర్లు, ఆయాలపై పై అధికారుల పెత్తనంపై పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కలీందర్, ఏఐటియుసి అంగన్వాడీ జిల్లా కార్యదర్శి తోకల సరస్వతి, సిపిఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గారాజ్ లు పాల్గొన్నారు.